స్థానిక ఎన్నికలపై జగన్ ఫోకస్.. నేడు కీలక భేటీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే క్రమంలో కేడర్ నుంచి ముఖ్య నేతల వరకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పరిస్థితులపై నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.
తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపైనా జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.