శాంతిభద్రతలపై పటిష్ట నిఘా బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు
బాడంగి, సెప్టెంబర్ 28 (మేజర్ న్యూస్): బాడంగి పోలీస్‌స్టేషన్‌ను బొబ్బిలి డీఎస్పీ ఆర్. గోవిందరావు సోమవారం వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. స్టేషన్‌లోని రికార్డులు, దస్త్రాలు, పరిసరాలను పరిశీలించిన ఆయన వాటి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉండటంతో పాటు ఎస్సై పి.సూర్యకుమారి, సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సమస్యాత్మక పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న వ్యక్తులపై ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు అప్రమత్తంగా
వ్యవహరించాలని సూచించారు.
అనంతరం పోలీస్‌స్టేషన్ సిబ్బందితో సమీక్ష నిర్వహించిన డీఎస్పీ.. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, హెరాయిన్ తదితర మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. మహిళలు, మైనర్ల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన పెంచాలని సూచించారు. రహదారి భద్రతపై ప్రజలను చైతన్యపరచాలని, మహిళలు ఫిర్యాదు కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చినప్పుడు గౌరవంగా వ్యవహరించి, ఫిర్యాదు తీవ్రతను బట్టి చట్టప్రకారం తక్షణమే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
మహిళా పోలీసులకు ప్రత్యేక సూచనలు
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళా పోలీసులతో డీఎస్పీ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో చిన్నపాటి వివాదాలు పెద్ద సమస్యలుగా మారకుండా ముందస్తుగా స్పందించాలని సూచించారు. స్థానిక పెద్దలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల సహకారంతో చట్టపరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
గ్రామాల్లో ప్రజలతో నిత్యం మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పించాలని, సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బొబ్బిలి రూరల్ సీఐ ఆర్.మల్లికార్జునరావు, బాడంగి ఎస్సై పి.సూర్యకుమారి, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు.