బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఫిర్యాదులపై నిష్పక్షపాత విచారణ జరపాలి
అనంతపురం బ్యూరో
బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఫిర్యాదులపై నిష్పక్షపాత విచారణ జరపాలి
పుట్టపర్తి, సెప్టెంబర్ 28: బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల ఫిర్యాదులపై నిష్పక్షపాత విచారణ జరపాలని పీఎస్‌యూ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ మోర్య భరద్వాజ్‌కు వినతిపత్రం అందజేశారు.
ముదిగుబ్బలో విధులు నిర్వహిస్తున్న హెచ్‌డబ్ల్యూఓ సరస్వతికి సంబంధించిన షోకాజ్ నోటీసులు, విధుల నిర్వహణ తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను అధికారికంగా విచారించి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు. మహిళా ఉద్యోగుల వాంగ్మూలాలను గోప్యంగా స్వీకరించి, సంబంధిత పత్రాలు, ఆధారాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
విచారణపై ప్రభావం పడకుండా విచారణ పూర్తయ్యే వరకు డీడీని విధుల నుంచి తప్పించాలని, ఫిర్యాదుదారులపై ఎలాంటి ఒత్తిడి లేదా ప్రతీకార చర్యలు లేకుండా చూడాలని కోరారు. ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన చేపడతామని మంజుల నరేంద్ర తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.