సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు
విశాఖపట్నం, సూర్య : ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖపట్నం వేదికగా నిర్వహించనున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్‌తో కలిసి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై సమీక్షించారు.
సదస్సుకు హాజరయ్యే దేశ, విదేశీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. లైజన్ అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలు, అతిథుల అవసరాలు, కార్యక్రమాల వివరాలపై ముందుగానే పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పర్యాటక ప్రదేశాలు, స్థానిక విశేషాలను విదేశీ అతిథులకు పరిచయం చేసేలా ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లు రూపొందించాలని, అవసరమైన గైడ్లను సిద్ధం చేయాలని చెప్పారు. హాప్-ఆన్ హాప్-ఆఫ్ బస్సులను వినియోగించుకోవాలని, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో వెల్కమ్ బోర్డులు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నగరమంతటా సమ్మిట్ బ్రాండింగ్, ప్రచార కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన సివిల్ పనులు, నగర సుందరీకరణ, పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేదికలు, ఇతర నిర్మాణాల స్ట్రక్చరల్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, విద్యుత్ భద్రతను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు. అతిథుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.
విమానాశ్రయంలో ప్రత్యేక రిసెప్షన్ డెస్క్, వెల్కమ్ టీమ్ ఏర్పాటు చేయాలని, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అతిథులకు ఘన స్వాగతం పలకాలని సూచించారు. సంప్రదాయ కండువాలతో స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అతిథుల వసతి, రవాణా, ప్రోటోకాల్, వెల్కమ్ డిన్నర్, గాలా డిన్నర్ ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలన్నారు. రిజిస్ట్రేషన్, పాసుల జారీ ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రధాన వేదికకు ఎదురుగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో రిజిస్ట్రేషన్ డెస్కులు ఏర్పాటు చేయాలని సూచించారు. తగిన పార్కింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, పార్కింగ్ ప్రాంతాలు, బయట ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు.
సమన్వయం చేసుకుంటూ పటిష్ట ఏర్పాట్లు చేస్తాం: జిల్లా కలెక్టర్
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ నవంబర్ 9వ తేదీ నుంచి కంట్రోల్ రూమ్ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, పాసుల జారీని కలెక్టరేట్ నుంచి పర్యవేక్షిస్తామని, సంబంధిత శాఖల అధికారులు కంట్రోల్ రూమ్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. జిల్లా యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నామని, ప్రతి శాఖతో సమన్వయం చేసుకుంటూ సదస్సును విజయవంతం చేస్తామని పేర్కొన్నారు.
ఈ సమీక్షలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఏపీఈడీబీ సీఈఓ సాన్మోహన్, ఏపీఐఐసీ చైర్మన్, ఎండీ దినేష్ కుమార్, సెర్ప్ సీఈఓ కరుణ, జీసీసీ ఎండీ శోభిక, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఐఏఎస్ అధికారులు గీతాంజలి శర్మ, గెడ్డం శేఖర్ బాబు, డీసీపీ మణికంఠ తదితరులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.