సమస్యల పరిష్కారమే ధ్యేయం - ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే కావ్య కృష్ణరెడ్డి
బిట్రగుంట, మేజర్ న్యూస్: కావలి నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం బోగోలులోని ఎమ్మెల్యే వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన 'ప్రజా దర్బార్' కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి అర్జీలు స్వీకరించారు. బోగోలు మండలం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వయంగా వినతిపత్రాలను (అర్జీలను) స్వీకరించారు. బాధితులు, అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల తీవ్రతను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అర్జీదారుల సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే, అక్కడే ఉన్న సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. ప్రజా దర్బార్‌లో స్వీకరించిన ప్రతీ అర్జీని రికార్డు చేసి, విచారణ జరిపి త్వరితగతిన న్యాయం చేయాలని, అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.