రూ 10.75 కోట్లతో మండపేటలో అభివృద్ధి పనులు
*రూ.10.75 కోట్లతో మండపేట మండలంలో అభివృద్ధి పనుల పండగ*
*వర్షంలోనే పలు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేగుళ్ల
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. మండపేట మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం కురిసిన వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పర్యటించిన ఆయన, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి మొత్తం రూ.10.75 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు. సాస్కి నిధుల కింద రూ.10.05 కోట్లతో చేపట్టనున్న పలు రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. జెడ్.మేడపాడు–కేశవరం రోడ్డుకు రూ.2.76 కోట్లు, మండపేట–ఏడిదసావరం వయా నాబార్డు బ్రిడ్జి రోడ్డుకు రూ.2.28 కోట్లు, ఏడిద సీతానగరం ర్యాంపు–మెర్నిపాడు బ్రిడ్జి రోడ్డుకు రూ.1.71 కోట్లు కేటాయించారు. అలాగే ద్వారపూడి–యానం రోడ్డు నుంచి చినద్వారపూడి రోడ్డుకు రూ.1.50 కోట్లు, ద్వారపూడి–జెడ్.మేడపాడు రోడ్డుకు రూ.1.20 కోట్లు, ఏడిద కొత్తూరు పుంత వయా రాజీవ్ గృహకల్ప రోడ్డుకు రూ.60 లక్షలతో పనులు చేపట్టనున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, డ్రైనేజీ, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. రుడా నిధులతో జెడ్.మేడపాడులో రూ.30 లక్షలు, చినద్వారపూడిలో రూ.23.80 లక్షలతో డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పనపాడు రిలయన్స్ కాలనీలో రూ.2 లక్షలతో మంచినీటి పైపులైన్ ఏర్పాటుకు, కేశవరం గ్రామంలో శ్మశానవాటిక అభివృద్ధికి మండల గ్రాంటు నుంచి రూ.15 లక్షలతో పనులకు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు