రోడ్డు విస్తరణ మట్టి ప్రైవేట్ లేఅవుట్‌కు తరలింపుపై ఆరోపణలు
ఎవరు వాటా ఎంత అని గుసగుసలాడుతున్న ప్రజలు?
ఎలమంచిలి: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో అనకాపల్లి–ఎలమంచిలి రహదారి విస్తరణ పనులకు సంబంధించిన గ్రావెల్, మట్టిని అనుమతులు లేకుండా ప్రైవేట్ లేఅవుట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రోడ్డు విస్తరణలో భాగంగా తొలగిస్తున్న మట్టిని ఒక ప్రైవేట్ లేఅవుట్‌లో ఫిల్లింగ్‌కు ఉపయోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ లేఅవుట్ కూటమి పార్టీలోని ఓ అగ్రనేతకు సంబంధించినదిగా ప్రచారం జరుగుతోందని వారు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ పనులకు సంబంధించిన మట్టి, గ్రావెల్‌ను ప్రైవేట్ అవసరాలకు తరలించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఎంత పరిమాణంలో మట్టి తరలించారు? రవాణాకు సంబంధించి అధికారిక అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన మట్టి తరలింపుపై పూర్తి వివరాలను అధికారులు వెల్లడించి, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.