రైతులు, పేదల సమస్యలపై పోరాడటమే సోమేశ్వరరావుకు నిజమైన నివాళి
పాలకొల్లు, సూర్య న్యూస్, పేదల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేయడమే కామ్రేడ్ అడ్డాల సోమేశ్వరరావుకు అర్పించే నిజమైన నివాళి అని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఏ. రవి అన్నారు. పాలకొల్లులోని స్థానిక పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ అడ్డాల సోమేశ్వరరావు 15వ వర్ధంతి సభ నిర్వహించారు. తొలుత సీపీఎం పార్టీ మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ దిగుపాటి రాజగోపాల్ సోమేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సభకు పార్టీ మండల కన్వీనర్ బాతిరెడ్డి జార్జి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఏ. రవి మాట్లాడుతూ నేటి రాజకీయాల్లో ప్రజా సమస్యలపై చివరి వరకు పోరాడే నాయకులు కరువయ్యారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, సర్ పేరుతో ఓటు హక్కును కాలరాస్తూ బతికున్నవారిని సైతం చంపినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, ప్రశ్నించే వారి గొంతు నొక్కే విధంగా నేటి రాజకీయాలు సాగుతున్నాయని అన్నారు.కామ్రేడ్ అడ్డాల సోమేశ్వరరావు రైతుల సమస్యల పరిష్కారం కోసం గిట్టుబాటు ధర, సాగునీరు, కొబ్బరి రైతులకు సరైన ధర కల్పన వంటి అంశాలపై పోరాటాలు చేశారని గుర్తుచేశారు. వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు విత్తనాలు, పురుగుమందులతో పాటు రుణాలు అందేలా కృషి చేశారని తెలిపారు. పేద ప్రజల సమస్యలపై కూడా అనేక పోరాటాలు నిర్వహించారని, మండల, తాలూకా, జిల్లా రైతు సంఘాల్లో నాయకుడిగా పనిచేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లి రైతులు, పేదల హక్కుల కోసం పోరాడటమే ఆయనకు నిజమైన నివాళి అని ఏ. రవి అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు చల్లా సోమేశ్వరరావు, బాసిన శ్యామల, తిరుమాని శీను, సత్యంశెట్టి శివ పురుషోత్తం, ఎర్ర అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.