రాజమండ్రి కార్పొరేషన్‌లో విలీనం, వార్డుల పునర్విభజన పిటిషన్లు కొట్టివేత.. 6 వారాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఏపీ హైకోర్టు ఆదేశం
అమరావతి, సూర్య ప్రతినిధి: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌లో పరిసర గ్రామాల విలీనం మరియు వార్డుల పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. వార్డుల పునర్విభజన వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC)లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి కార్పొరేషన్ పరిధి పొడిగింపు, గ్రామాల విలీనం మరియు కొత్త వార్డుల విభజన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగానే జరిగిందని స్పష్టం చేసిన కోర్టు, తక్షణమే ఎన్నికల దిశగా అడుగులు వేయాలని సూచించింది. వచ్చే ఆరు వారాల్లోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించడంతో, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఉన్న ప్రధాన న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి.