రాజమహేంద్రవరం పర్యటకానికి నూతన శోభ
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
గోదావరి తీరంలోని చారిత్రక హేవలాక్ వంతెనను అంతర్జాతీయ స్థాయి పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు మంగళవారం పర్యాటక శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూ.42.86 కోట్ల SASCI నిధులతో కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
వంతెనపై సుమారు 2.7 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేస్తున్న పాదచారుల మార్గం, గ్లాస్ ఫ్లోరింగ్, ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ డైనమిక్ లైటింగ్, సౌండ్ అండ్ లైట్ ప్రదర్శనలు పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందించనున్నాయని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, పిల్లల కోసం బ్యాటరీ వాహనాలు, ఫుడ్ కోర్టులు, క్రాఫ్ట్ బజార్, ఓపెన్ ఎయిర్ థియేటర్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న SASCIతో పాటు వివిధ కేంద్ర పథకాల సహకారంతో రాష్ట్రంలో పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధికి ఊతం లభిస్తోందని సోము వీర్రాజు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయని తెలిపారు.
కూటమి ఐక్యతను కాపాడుకుంటూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అభిప్రాయ భేదాలను పక్కనబెట్టి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ పరిశీలనలో పర్యాటక శాఖ అధికారులు, ఇంజనీరింగ్ విభాగాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
–