ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తన దృష్టికి తీసుకురావచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన ఇబ్బందులను తగ్గించి, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌర సేవలు సకాలంలో అందేలా చూడటం తమ బాధ్యతని పేర్కొన్నారు. ప్రజా దర్బార్‌లో అందిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రజల సమస్యలను వినడంతోపాటు వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే ప్రజా దర్బార్ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- అరికొండ ప్రతాప్ కుమార్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా