పీఎం స్వనిధితో వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా
విశాఖపట్నం, మేజర్ న్యూస్ :
పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి జీవనోపాధిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీవీఎంసీ ప్రాజెక్ట్ డైరెక్టర్ (యూసీడీ) బి.వి.రమణ తెలిపారు. భీమిలి జోనల్ కార్యాలయంలో సోమవారం జోనల్ కమిషనర్ ఇప్పి నాయుడు ఆధ్వర్యంలో వీధి విక్రయదారుల కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జీవీఎంసీ పరిధిలో ఇప్పటివరకు 6,517 మంది వీధి వ్యాపారులకు రూ.12.95 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. పథకం కింద మొదటి విడతలో రూ.15 వేలు, రెండో విడతలో రూ.25 వేలు, మూడో విడతలో రూ.50 వేల వరకు దశలవారీగా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
వీధి వ్యాపారులను బ్యాంకింగ్ సేవలకు అనుసంధానం చేయడంతో పాటు ఇప్పటివరకు 25 మందికి క్రెడిట్ కార్డులు అందించినట్లు బి.వి.రమణ తెలిపారు. మరో సుమారు 4,000 మంది వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
అదేవిధంగా వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి బీమా, సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
సమావేశంలో భీమిలి ఏపీడీ దొర, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల మేనేజర్లు, వీధి విక్రయదారుల కమిటీ సభ్యులు, జీవీఎంసీ యూసీడీ, మెప్మా సిబ్బంది, టీఎల్ఎఫ్ ప్రతినిధులు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.