పేదల పక్షపాతి, ఆదర్శమూర్తి ఎస్.ఆర్. శంకరన్
ఘనంగా 17వ వర్ధంతి వేడుకలు – కావలిలో సీపీఐ ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులు.
కావలి మేజర్ న్యూస్ : సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, పేదల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శ ఐఏఎస్ అధికారి, సామాజిక సేవకుడు ఎస్.ఆర్. శంకరన్ 17వ వర్ధంతిని కావలి పట్టణంలోని జనతాపేటలో సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు, గిరిజ ప్రాంతాల్లో ఐటీడీఏ ఏర్పాటు, మనుషుల చేత మలమూత్రాలు ఎత్తించే అమానుష పద్ధతిని రూపుమాపడంలో శంకరన్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దేశంలో వెట్టిచాకిరీ, బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టాల అమలులో ఆయన కృషి మరువలేనిదని తెలిపారు. తన జీతంలో సింహభాగాన్ని నిరుపేద విద్యార్థుల చదువుల కోసం వెచ్చించిన శంకరన్, ప్రభుత్వ పదవిలో ఉన్నప్పటికీ సామాన్యుల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను, సామాజిక న్యాయ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడమే శంకరన్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు మండ్ల వెంకటేశ్వర్లు, కామిశెట్టి చంద్రశేఖర్, సీపీఐ కావలి డివిజన్ సహాయ కార్యదర్శి దమ్ము దర్గాబాబు, నాయకులు పుల్లా ఆదినారాయణ, డి.ఎం. కొండయ్య, కే. కైలాసనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.