విశాఖను తూర్పు తీర ఆర్థిక ముఖద్వారంగా అభివృద్ధి చేస్తాం
*సీఐఐ రీజనల్ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్
సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి :
ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధికి విశాఖపట్నం కీలక కేంద్రంగా ఎదుగుతోందని, ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు సహకారంతో విశాఖను తూర్పు తీరంలో ప్రధాన ఆర్థిక ముఖద్వారంగా తీర్చిదిద్దడంతో పాటు, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. ఐదు ప్రాంతీయ సదస్సుల్లో తొలి సదస్సుకు విశాఖ ఆతిథ్యం ఇచ్చిందని, నవంబర్ 12, 13 తేదీల్లో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ కూడా ఇక్కడే జరగనుందని వెల్లడించారు. బుధవారం గంభీరంలోని ఐఐఎం-విలో జరిగిన సీఐఐ రీజనల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విజయనగరం జీఎంఆర్ ఏవియేషన్ హబ్, విశాఖ బే సిటీలో రానున్న మైస్ సదుపాయం వంటి ప్రాజెక్టులు ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడనున్నాయని అన్నారు. విశాఖలో గూగుల్, టీసీఎస్, అనకాపల్లిలో ఏఎంఎన్ఎస్, లారస్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో నవయుగ రెన్యూవబుల్ ఎనర్జీ, శ్రీకాకుళంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ వంటి సంస్థల పెట్టుబడులు ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. అందరి సహకారంతో, సమష్టి కృషితో సీఐఐ ప్రాంతీయ సదస్సును విజయవంతంగా నిర్వహింగలిగామని పేర్కొన్నారు. నవంబర్ లో జరిగే పార్టనర్షిప్ సమ్మిట్ ను కూడా అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహిస్తామని వెల్లడించారు.
........................................................................…
జారీ, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విశాఖపట్టణం.