రీజనల్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ప్రత్యేక ప్రదర్శనలో భాగస్వామ్యమైన 25 సంస్థలు
* విశాఖ, ఉత్తరాంధ్ర ఉత్పత్తులు.. పారిశ్రామిక ఆవిష్కరణలకు వేదిక
సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి :
గంభీరం ఐఐఎంలో బుధవారం నిర్వహించిన సీఐఐ రీజనల్ సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సందర్శించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి ఉన్నారు. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ సంస్థల స్టాళ్లను వారు సందర్శించి, ప్రదర్శిస్తున్న ఉత్పత్తులు, సాంకేతికతలు, ఆవిష్కరణల గురించి ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. సీఐఐ రీజనల్ సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో వివిధ రంగాలకు చెందిన 25 సంస్థలు భాగస్వాయమయ్యాయి. ఉత్తరాంధ్రలోని పారిశ్రామిక, వ్యవసాయ, సాంకేతిక, ఆరోగ్య, హస్తకళలు, స్థానిక ఉత్పత్తుల వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శనను ఏర్పాటు చేశాయి. ఎగ్జిబిషన్‌లో హైడ్రాలిక్స్, మెటలర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, హెల్త్‌కేర్, డెంటల్ సొల్యూషన్స్, అగ్రిటెక్, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, కొబ్బరి ఫైబర్ ఉత్పత్తులు, లెదర్ పరిశ్రమ తదితర రంగాలకు చెందిన సంస్థలు తమ ఉత్పత్తులు, సాంకేతికతలు, సేవలను ప్రదర్శించాయి. అదేవిధంగా అరకు కాఫీ, పొందూరు ఖాదీ, మాడుగుల హల్వా, ఆంధ్ర వుడెన్ టాయ్స్ వంటి విశాఖ, ఉత్తరాంధ్ర ప్రత్యేకతను చాటే స్థానిక ఉత్పత్తులకు కూడా ప్రాధాన్యం కల్పించారు. స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలను విస్తరించడంతో పాటు, పెట్టుబడిదారులు, పరిశ్రమల మధ్య అనుసంధానానికి ఈ ప్రదర్శన వేదికగా నిలిచింది. ఎగ్జిబిషన్‌లో జామి హైడ్రాలిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, జూహి మెటలర్జికల్ ల్యాబ్, డెంటలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్, పీబీ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, సెమాపి ఇన్‌స్ట్రుమెంట్స్, అక్రివిస్ హెల్త్‌కేర్, ఓషనాటిక్స్, పీలూన్ అగ్రిఫ్రెష్, మన మన్యం ప్రొడ్యూసర్స్ కంపెనీ, అవని ఆర్గానిక్స్, విన్‌విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. స్థానిక ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు, పరిశ్రమలకు కొత్త భాగస్వామ్యాలు, పెట్టుబడులకు అవకాశాలు కల్పించే దిశగా ఈ ప్రదర్శన నిలిచింది