పల్లెపండుగకు పకడ్బందీ ఏర్పాట్లు
పల్లెపండుగకు పకడ్బందీ ఏర్పాట్లు
29న ఉదయగిరి నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు.. రామాపురంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే డా. ఉగ్ర నరసింహారెడ్డి
సూర్య ప్రతినిధి ఒంగోలు :
పల్లెపండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌తో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వేదిక, సభా ప్రాంగణం, ప్రజల రాకపోకలు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లతో పాటు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై వారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యేలు సూచించారు. ప్రతి ఏర్పాటును పకడ్బందీగా పూర్తి చేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.