నాణ్యమైన శిక్షణతోనే మెరుగైన ఉపాధి
శిక్షణ సర్టిఫికెట్‌కే పరిమితం కాకూడదు*
సీడాప్ ఆధ్వర్యంలో ఘనంగా డీడీయూజీకేవై 2.0 వర్క్ షాప్
విజయవాడ, అక్టోబర్ 7: గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి స్థిరమైన ఉపాధి కల్పించడమే దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన–2.0 లక్ష్యమని కేంద్ర, రాష్ట్ర అధికారులు స్పష్టం చేశారు. శిక్షణ నుంచి ఉపాధి, అనంతర పర్యవేక్షణ వరకు నాణ్యత, పారదర్శకత, సాంకేతికతకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు సూచించారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖకు చెందిన సీడాప్ సహకారంతో బుధవారం విజయవాడలోని హయత్ ప్లేస్‌లో దక్షిణ ప్రాంతీయ వర్క్‌షాప్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, పుదుచ్చేరి, అండమాన్–నికోబార్ దీవుల నుంచి 52 మంది అధికారులు, 80 మంది శిక్షణ అమలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఎన్ ఆర్ టీ అధ్యక్షులు మాట్లాడుతూ డా. రవి కుమార్ పి.వేమూరి మాట్లాడుతూ శిక్షణ కేవలం ధ్రువపత్రాలకే పరిమితం కాకుండా ఉద్యోగం, ఆదాయం, స్థిరమైన జీవనోపాధికి దోహదపడాలని అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్,అఖిలేష్ ఝా మాట్లాడుతూ నాణ్యమైన శిక్షణ, మూల్యాంకనం, ఉపాధి ధ్రువీకరణ, అనంతర పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్,జి. గణేష్ కుమార్, ఐఏఎస్ మాట్లాడుతూ .. డిజిటల్ విధానాలతో శిక్షణ, మూల్యాంకనం, ఉపాధి కల్పనను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
సీడాప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పాలడుగు నారాయణస్వామి మాట్లాడుతూ సీసీ కెమెరాల అనుసంధానం, మూడు దశల ఉపాధి ధ్రువీకరణ, క్యూఆర్ కోడ్ ఆధారిత అభ్యర్థుల సమీకరణ వంటి చర్యలపై వర్క్షాప్ లో వివరించారు. వర్క్‌షాప్‌లో అభ్యర్థుల ఎంపిక, శిక్షణ కేంద్రాల మౌలిక వసతులు, శిక్షణ, మూల్యాంకనం, ధ్రువీకరణ, ఉపాధి, అనంతర పర్యవేక్షణ, నిధుల విడుదలపై చర్చించారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు తమ అనుభవాలు, సవాళ్లను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సీడాప్ కార్యనిర్వాహక సంచాలకులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్, రాష్ట్ర ప్రాజెక్ట్ మేనేజర్లు, జిల్లా ఉద్యోగ నిర్వాహకులు పాల్గొన్నారు.