మోదీ జన్మదినం.. సేవా సంకల్పంతో బీజేపీ
మార్కాపురం మేజర్ న్యూస్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దోర్నాల బస్టాండ్ ఆవరణంలో బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ నాయకుడు పీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై దిల్లీలో జరిగిన కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వీక్షించారు.ఈ సందర్భంగా పీవీ కృష్ణారావు మాట్లాడుతూ దేశ ప్రగతికి దృఢమైన దిశానిర్దేశంతో మోదీ ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రజా సంక్షేమం, దేశ ఆర్థిక ప్రగతి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.మోదీ జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా సేవకు ప్రతీకగా మలచాలనే ఉద్దేశంతో నెలరోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి భారత్‌ను మరింత అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అనంతరం సేవా సంకల్ప జ్యోతి ర్యాలీ నిర్వహించారు. దోర్నాల బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని నాలుగు ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కే. శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు మల్లెల గొన్స్, గుంటక సుబ్బారెడ్డి, దేవిశెట్టి చంద్రశేఖర్, మండల నాయకులు శివప్రసాద్, టి. అశోక్‌రెడ్డి, దేశబోయిన శ్రీను, లక్ష్మి, అనిశెట్టి కొండలు, ఎం. పుల్లయ్య, వెంకటేశ్వర్లు నాయక్ తదితరులు పాల్గొన్నారు.