మత్స్యకారుల జీవన ప్రమాణాల పెంపు, ఆర్థిక స్వావలంబనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం
నరసాపురం, సూర్య న్యూస్ మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి, వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. నరసాపురం మండలం పెద్దమైనవానిలంక గ్రామంలో మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సీఎస్‌ఆర్ నిధులు రూ.50 లక్షలతో 39 మంది మత్స్యకార లబ్ధిదారులకు అందించిన ఉపాధి సాధనాలు వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌తో కలిసి ఆయన లబ్ధిదారులకు 7 ఆటోలు, 12 మోపెడ్లు, 20 బోట్లు, వలలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, తీర ప్రాంత ప్రజల కష్టాలను గుర్తించి, వారి అభివృద్ధి కోసం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నారని తెలిపారు. పెద్దమైనవానిలంక గ్రామానికి చెందిన ఆడబిడ్డగా ఆమె ఇక్కడి మత్స్యకారుల సమస్యలను అర్థం చేసుకొని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. సముద్ర కోత నివారణకు సుమారు రూ.13 కోట్లతో రక్షణ గోడ నిర్మాణం, డిజిటల్ భవనం ఏర్పాటు, ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ సౌకర్యం కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలోనూ ప్రభుత్వం జీవనోపాధి భృతి అందిస్తూ అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రభుత్వాలు అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకొని, తమ వృత్తిని అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని లబ్ధిదారులకు శ్రీనివాస వర్మ సూచించారు. ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, తీర ప్రాంత అభివృద్ధికి నిర్మలా సీతారామన్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. సముద్ర కోత నుంచి గ్రామాన్ని రక్షించేందుకు సుమారు రూ.13.50 కోట్లతో ఒక కిలోమీటరు పొడవున రక్షణ గోడ నిర్మించినట్లు పేర్కొన్నారు. మత్స్యకారులకు వృత్తి పరికరాలు, రవాణా సదుపాయాలు అందించడం ద్వారా వారి ఉపాధిని మెరుగుపరచవచ్చన్నారు. ఆటోలు, మోపెడ్లతో చేపల రవాణా, విక్రయాలు సులభతరం అవుతాయని, బోట్లు, వలలతో చేపల వేటకు అవసరమైన వనరులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి అందేలా శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, మత్స్యకారుల సంక్షేమానికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం ద్వారా వారి కుటుంబాలకు భరోసా కల్పించవచ్చన్నారు. ప్రభుత్వం, బ్యాంకులు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని మత్స్యకారులు తమ వృత్తిలో మరింత అభివృద్ధి సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. ఎస్‌బీఐ సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన ఈ కార్యక్రమం మత్స్యకార కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల విస్తరణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ రామకృష్ణ, జిల్లా మత్స్యశాఖ అధికారి డా. డి. శ్రీనివాస్, ఎల్‌డీఎం జాన్ మార్టిన్, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పోత్తూరి రామరాజు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పీఆర్వో పేరాల మోహన్, కొవ్వలి ఏతి రాజా రామ్మోహన్ రాయుడు, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా