జాతీయ స్థాయి క్రీడాకారుడికి ఆర్థిక సాయం
షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థికి రూ.10 వేల అందజేత
బుక్కరాయసముద్రం: జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థికి మాజీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న చంద్ర కుమారుడు రుషిందర్ ఇటీవల పులివెందులలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ షూటింగ్ బాల్ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచి, నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్ షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు.
పోటీలకు హాజరయ్యేందుకు అవసరమైన ఖర్చుల నిమిత్తం రామలింగారెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని విద్యార్థికి అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని అభినందించి, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం నీరజ, పీడీ గట్టు నాగరాజు, ఉపాధ్యాయులు నాగేంద్రప్రసాద్, కోటప్ప, బాలకృష్ణ, సాగునీటి సంఘం చైర్మన్ పెద్ద శివయ్య, స్కూల్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.