ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన కనకదుర్గమ్మ దర్శనం
- నేడు బాలా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిస్తున్న జగన్మాత
- అన్ని దర్శన మార్గాల్లో ఉచిత దర్శన సౌకర్యం
కుంకుమార్చనలు, చండీ హోమం ప్రారంభం
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజైన ఆదివారం జగన్మాత శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం ప్రారంభమైన సందర్భంగా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆలయ చైర్మన్, ఈవో అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. అన్ని దర్శన మార్గాల్లో ఉచిత దర్శన సౌకర్యం కల్పించారు. నూతన పూజా మండపంలో కుంకుమార్చన పూజలు ప్రారంభమయ్యాయి. యాగశాలలో శాస్త్రోక్తంగా చండీ హోమానికి ఆరంభ పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల తొలిరోజున అమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో దర్శనమివ్వడం విశేషం. బాల్యంలోని నిర్మలత్వం, పవిత్రత, జ్ఞానశక్తికి ప్రతీకగా భావించే ఈ రూపాన్ని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు, పోలీసు శాఖతో పాటు సంబంధిత విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి.