ఎన్నికల పర్యవేక్షణకు 13,500 సీసీ కెమెరాలు
విజయవాడ, మేజర్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన 13,500 సీసీ కెమెరాల వెబ్‌కాస్టింగ్ వ్యవస్థ పనితీరును రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లికార్జున పరిశీలించారు. ఆదివారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కేంద్రం ద్వారా వివిధ జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా వెబ్‌కాస్టింగ్ వ్యవస్థ పనితీరు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న విధానాన్ని అధికారులు మీడియాకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏయే జిల్లాల్లో ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు, వాటి ద్వారా ఎన్నికల ప్రక్రియను ఎలా పర్యవేక్షిస్తున్నారనే వివరాలను కమిషనర్‌కు తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడం, పోలింగ్ కేంద్రాల్లో జరిగే కీలక పరిణామాలను నిరంతరం పర్యవేక్షించడం, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండేందుకు వెబ్‌కాస్టింగ్ వ్యవస్థను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా ఎన్నికల నిర్వహణను నిరంతరం గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.