చిప్పిలి సమ్మర్ స్టోరేజీని నింపి మదనపల్లె ప్రజల దాహార్తిని తీర్చాలి
మెడికల్ కాలేజీనీ పూర్తిచేసి,బీటీ కాలేజీని యూనివర్సిటీ చేయాలి
- కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం
- రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విమర్శలు
మదనపల్లె : హంద్రీ-నీవా ద్వారా కృష్ణ జలాలు మదనపల్లికి వచ్చినప్పటికీ తాగునీటి కష్టాలు తీరలేదని,చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పూర్తిస్థాయిలో నింపి మదనపల్లె ప్రజల తాగునీటి కష్టాలను తీర్చాలని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం బెంగళూరు రోడ్డులోని హాజీ ప్యారిజాన్ గార్డెన్ నందు మదనపల్లి వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 2న మదనపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి,ఉపముఖ్యమంత్రి పాల్గొని రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ ఏర్పాటు చేస్తున్నట్లు హడావిడి చేశారని,దీనితో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు.అయితే మదనపల్లి గుండా హంద్రీ-నీవా జలాలు వెళ్తున్నప్పటికీ మదనపల్లి ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కునే పరిస్థితి ఉందన్నారు.చిప్పిలి సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నింపకపోవడంతో ప్రజల అవస్థలు పడుతున్నారన్నారు.గత వైసిపి ప్రభుత్వంలో మదనపల్లి మెడికల్ కళాశాల దాదాపు పూర్తయిందని వైద్యులు,సిబ్బందిని సైతం నియమించి వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగిందని,ప్రభుత్వం వచ్చిన వెంటనే మెడికల్ కళాశాలను పక్కన పెట్టిందని ఆరోపించారు.మెడికల్ కళాశాల పూర్తయితే పేదలకు నాణ్యమైన వైద్యం అందేదని ఆయన తెలిపారు.వాస్తవానికి లక్ష కోట్లు పెట్టుబడులను అమరావతిలో పెడుతున్నారని అడుగు రూ.2000 ఖర్చు చేయాల్సిన చోట,20 వేలు ఖర్చు పెడుతున్నారని,నీటిని తోడడానికి ఏడాదికి రూ.500 కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు.కేవలం 100 కోట్లు ఖర్చు పెడితే మదనపల్లె మెడికల్ కళాశాల పూర్తవుతుందన్నారు.చారిత్రాత్మక బీటీ కళాశాలను యూనివర్సిటీ హోదా కల్పించడంలో జాప్యం చేస్తున్నారన్నారు.అనీబిసెంట్ ట్రస్ట్ వారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులు ప్రభుత్వానికి అప్పగించారని,అన్ని జీవోలు వచ్చిన తర్వాత యూనివర్సిటీ చేయకపోవడం బాధాకరమన్నారు.మెడికల్ కళాశాల,బిటీ కళాశాలను యూనివర్శిటి చేస్తే మదనపల్లెని సరస్వతి నిలయంగా మార్చవచ్చునని మాజీ సీఎం జగన్ భావించారన్నారు.వాటిని కూటమి ప్రభుత్వం నీరుగార్చిందన్నారు.ఇక అన్నమయ్య జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోందని,కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.వ్యవసాయ బోర్లు పూర్తిస్థాయిలో అడగంటిపోయాయని,రైతులు పాడిఆవులు పశువులను అమ్ముకునే పరిస్థితి నెలకొందన్నారు.కనీసం పశుగ్రాసం కూడా సరఫరా చేయడం లేదని విమర్శించారు.గత ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హులైన చేనేత కార్మికులకు అందరికీ లబ్ధిచేకూర్చడం జరిగిందని,ప్రస్తుత ప్రభుత్వం నేతన్న సేవలో పథకం దుర్వినియోగం చేసిందన్నారు.మెడికల్ కళాశాలను పూర్తి చేయాలని,సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపాలని,బిటీ కళాశాలను యూనివర్సిటీ చేయాలని,జిల్లా కేంద్రమైన మదనపల్లిని అభివృద్ధి చేసి కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైసిపి ముఖ్య నేతలు నిస్సార్ అహ్మద్,డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి,అనూషా రెడ్డి,షమీమ్ అస్లాం,ఉదయ్ కుమార్,ఎస్.ఏ కరీముల్లా,దేవతా సతీష్,సి.పి రాఘవ రెడ్డి,జన్నే శేషాచలపతి నాయుడు,నూర్ అజామ్,తట్టి శ్రీనివాసులు రెడ్డి పెద్దసంఖ్యలో వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.