చర్చిలో ముగిసిన మహిళా వారోత్సవాలు
లక్ష్మీపురం సీఎస్‌ఐ చర్చిలో ముగిసిన మహిళా వారోత్సవాలు
భక్తిశ్రద్ధలతో ముగింపు ప్రార్థనలు.. ఆధ్యాత్మిక సందేశాలు
ఆకట్టుకున్న మహిళలు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు
ఎటపాక:మేజర్ న్యూస్ :పోలవరం జిల్లా మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో గల సీఎస్‌ఐ చర్చిలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. సెప్టెంబర్ 29న ప్రారంభమైన ఈ వేడుకల ముగింపు సభను చర్చి పాస్టర్లు శ్రీకాంత్, అలోక్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.వారం రోజులపాటు స్థానిక మహిళలు నిత్యం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కుటుంబ శ్రేయస్సు, గ్రామంలో శాంతిసౌభాగ్యాలు, సమాజ పురోగతిని కాంక్షిస్తూ దైవ సన్నిధిలో వేడుకున్నారు.ఆదివారం జరిగిన ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన స్తుతి ఆరాధనలు,ఆధ్యాత్మిక సందేశాలు విశ్వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం మహిళలు, యువత, చిన్నారులు ఆలపించిన గ్రూప్ సాంగ్స్, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. మహిళల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ఐక్యతను, సేవాభావాన్ని పెంపొందించేందుకే ఈ వారోత్సవాలు దోహదపడ్డాయని తెలిపారు. మహిళలు పరస్పరం సహకరించుకుంటూ కుటుంబాలను, సమాజాన్ని సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రార్థనల అనంతరం హాజరైన భక్తులకు సామూహిక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో లక్ష్మీపురంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, మహిళలు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.