బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధానంపై ఓటర్లకు అవగాహన
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల ప్రక్రియలో బ్యాలెట్ ద్వారా ఓటు వేసే ప్రక్రియపై జిల్లా కలెక్టర్ /జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎలక్షన్ అథారిటీ/ కమిషనర్ వై.ఓ నందన్ సమక్షంలో కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో మాస్టర్ ట్రైనర్ కనకరాజు శుక్రవారం విలేకరుల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్దేశకాల మేరకు నవంబర్ నెల ఒకటో తేదీ జరగనున్న సాధారణ ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో భాగంగా రాజకీయ పార్టీల అభ్యర్థులంతా నేటి సాయంత్రం ఐదు గంటలకు ప్రచారపర్వం ముగించి, స్వచ్ఛందంగా ఎన్నికల నియమావళిని అనుసరించాలని సూచించారు. ఓటర్ స్లిప్పులు అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలింగ్ రోజు కూడా తమకు సంబంధించిన బి.ఎల్.ఓ లను సంప్రదించి స్లిప్పులను పొందవచ్చని తెలిపారు.
అనంతరం మాస్టర్ ట్రైనర్ కనకరాజు బ్యాలెట్ పేపర్ నిర్వహణపై అవగాహన కల్పిస్తూ మాట్లాడారు. మేయర్ అభ్యర్థిత్వానికి నోటా తో కలిపి 16 మంది అభ్యర్థుల నామినేషన్లు ఖరారు అయిన కారణంగా పోలింగ్ బూత్ లోని అదర్ పోలింగ్ ఆఫీసర్ అందజేసే పింక్ బ్యాలెట్ స్లిప్పు ద్వారా నాలుగు మడతలు వేసిన పేపర్ మీద స్వస్తిక్ గుర్తును ముద్రించి బ్యాలెట్ బాక్స్ లో వేయాలని సూచించారు. ఆ మడిచిన విధానం ద్వారా ఇంక్ మార్కు ఇతర అభ్యర్థుల గుర్తులపై నమోదు కాకుండా ఉంటుందని సూచించారు. బ్యాలెట్ పేపర్ ను కింది నుంచి పై వైపుగా మడిచినప్పుడు మాత్రమే అధికారిక నెంబర్ పేపర్ చివర కనిపిస్తుందని వివరించారు.
కార్పొరేటర్ అభ్యర్థులు నమోదు తక్కువగా ఉన్నందున పూర్తిగా అదర్ పోలింగ్ ఆఫీసర్ అందజేసే వైట్ కలర్ లో ఉన్న ఆ బ్యాలెట్ పేపర్ను సగానికి మడిచి అభ్యర్థి గుర్తుపై స్వస్తిక్ గుర్తును ముద్రించడం వలన ఇతర అభ్యర్థుల గుర్తులపై నమోదు కాదని తెలియజేశారు. పోలింగ్ బూత్ లోని ఎన్నికల అధికారులు బ్యాలెట్ పేపర్ పై గుర్తును వేసేందుకు సూచించిన ఆదేశాలను పాటించి, బ్యాలెట్ బాక్స్ లో పేపర్ ను వేసి ఓటర్లు తమ విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రతి ఒక్క పోలింగ్ బూత్ లో ఉండే అదర్ పోలింగ్ ఆఫీసర్ సూచించిన విధానాల ద్వారా బ్యాలెట్ పేపర్లను మడిచి, తాము ఎన్నుకోబోయే అభ్యర్థి ముద్ర పై స్వస్తి గుర్తును అద్ది, జాగ్రత్తగా బ్యాలెట్ బాక్స్ లో వేయాలని, లేనిపక్షంలో ఓటర్ల విలువైన ఓటు చెల్లుబాటు కాకుండా పోయే అవకాశాలు ఉన్నాయని కమిషనర్ సూచించారు.