బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం ప్రభావం: విశాఖ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం, హైఅలర్ట్ జారీ
సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం మరింత బలపడి మునుపెన్నడూ లేని విధంగా ప్రభావం చూపుతోంది. విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ తీవ్రవాయుగుండం ఇవాళ రాత్రికి విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు మరియు రేపు కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి.
తీరం దాటే క్రమంలో గాలి వేగం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈదురుగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉన్నందున ఎవరూ కూడా చెట్లు మరియు హోర్డింగ్స్ కింద నిలబడవద్దని స్పష్టం చేశారు. అలాగే సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.
తీవ్రవాయుగుండం ప్రభావం కేవలం కోస్తాంధ్రకే పరిమితం కాకుండా, రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు ముప్పు పొంచి ఉన్నందున, లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురుగా అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విపత్తు నిర్వహణ శాఖ కోరింది. అధికార యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలకు సిద్ధంగా ఉంది.