భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి వేడుక
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ : నెల్లూరు మూలాపేటలో కొలువై ఉన్న శ్రీ భువనేశ్వరీ సమేత శ్రీ మూలస్థానేశ్వర దేవస్థానంలో మంగళవారం సంకటహర చతుర్థి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో వేంచేసియున్న ఆపత్ సహాయక గణపతి స్వామికి విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఉదయం నుంచే స్వామివారికి వేదమంత్రోచ్ఛారణల నడుమ విశేష అభిషేకాలు, అర్చనలు వైభవంగా జరిపారు. అనంతరం ఆ విఘ్నేశ్వరుడిని గరిక, మందార మాలలు మరియు వివిధ రకాల విశేష పుష్పాలతో సర్వాంగ సుందరంగా, శోభాయమానంగా అలంకరించారు. భక్తుల కష్టాలన్నీ తొలగిపోయి, సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ అర్చక స్వాములు భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక సంకల్పం పఠించారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించి, భక్తిపూర్వకంగా కర్పూర నీరాజనాలు అర్పించారు.ఈ విశేష కార్యక్రమాలను ఆలయ చైర్మన్ అజయ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, ధర్మకర్త మండలి సభ్యులు పర్యవేక్షించి విజయవంతంగా నిర్వహించారు.