బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
– డిప్యూటీ డీఈఓ శ్రీ నాయక్, జిల్లా బాలల సంరక్షణ అధికారి బి. సురేష్
నెల్లూరు కలెక్టరేట్ (మేజర్ న్యూస్)
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని డిప్యూటీ డీఈఓ శ్రీ నాయక్, జిల్లా బాలల సంరక్షణ అధికారి బి. సురేష్ పిలుపునిచ్చారు. బాల్య, ముందస్తు మరియు బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బాల్య వివాహ ముక్త భారత్ ప్రచారంలో భాగంగా నెల్లూరు నగరంలోని మూలాపేట దేశిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ శ్రీ నాయక్ మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల బాలికల విద్యాభ్యాసం మధ్యలోనే నిలిచిపోవడంతో పాటు వారి ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ప్రతి బాలికకు విద్యను అందించి, ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జిల్లా బాలల సంరక్షణ అధికారి బి. సురేష్ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలికల హక్కులను పరిరక్షించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. బాల్య వివాహాల వల్ల బాలికల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు విద్య, అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని వివరించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి వాటి నివారణకు సహకరించాలని కోరారు.
అనంతరం విద్యార్థినులతో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తామని, బాల్య వివాహాలను ప్రోత్సహించబోమని, బాల్య వివాహ రహిత భారతదేశ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని సామూహిక ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో సీజేడబ్ల్యూఎస్ డైరెక్టర్ ఐ. శ్రీనివాసరావు, పాఠశాల కమిటీ చైర్‌పర్సన్, పేరెంట్స్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, ఐసీపీఎస్ మరియు చైల్డ్‌లైన్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.