ఐక్యరాజ్యసమితి వేదికపై అరకు గళం..
- భారత్ తరఫున మాట్లాడిన ఎంపీ డా. గుమ్మ తనూజా రాణి
- గిరిజన ప్రాంతం నుంచి అంతర్జాతీయ వేదిక వరకు.. దేశ ప్రతినిధిగా అరుదైన అవకాశం
అరకు:
అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డా. గుమ్మ తనూజా రాణి అంతర్జాతీయ వేదికపై భారతదేశం తరఫున తన గళాన్ని వినిపించారు. ఐక్యరాజ్యసమితి 81వ సాధారణ సభకు సంబంధించిన భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో సభ్యురాలిగా ఆమెకు అరుదైన అవకాశం లభించింది. ఐక్యరాజ్యసమితి పరిపాలన, బడ్జెట్ వ్యవహారాలను పరిశీలించే ఐదవ కమిటీ తొలి అధికారిక సమావేశంలో ‘పని నిర్వహణ’ అంశంపై డా. తనూజా రాణి భారత్ తరఫున ప్రసంగించారు. ఐరాస పరిపాలనా, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, సమర్థత పెంపొందించేందుకు సంస్కరణల ప్రక్రియను నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
- ఐరాస ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కీలక సూచనలు
ఐక్యరాజ్యసమితి కార్యక్రమాలు సమర్థవంతంగా కొనసాగాలంటే సభ్యదేశాలు తమ ఆర్థిక బాధ్యతలను పూర్తిగా, సకాలంలో, ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా చెల్లించాలని ఆమె పిలుపునిచ్చారు. ఐరాస అభివృద్ధి కార్యక్రమాలకు తగినన్ని ఆర్థిక వనరులు కేటాయించాల్సిన అవసరాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. దేవిధంగా, ఐదవ కమిటీ పనితీరులో సలహా కమిటీలకు ఉన్న ప్రత్యేక అధికారాలను గౌరవించాలని, సభ్యదేశాల మధ్య పరస్పర సహకారం, ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఐరాస పనితీరును మరింత మెరుగుపరచవచ్చని తనూజా రాణి పేర్కొన్నారు.
- అరకు నుంచి ఐరాస వరకు.. గిరిజన మహిళకు అంతర్జాతీయ గుర్తింపు
అరకు వంటి గిరిజన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక మహిళా ఎంపీ భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగస్వామిగా ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించడం అరకు ప్రజలకు, గిరిజన సమాజానికి గర్వకారణంగా నిలిచింది. ముఖ్యంగా గిరిజన యువత, మహిళలు, విద్యార్థులకు ఇది స్ఫూర్తిదాయకమైన పరిణామంగా అభివర్ణిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ తరఫున మాట్లాడిన తనూజా రాణి.. ఐరాస సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు, పారదర్శక పరిపాలన వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా అరకు నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి న్యూయార్క్ వరకు తన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అధ్యాయాన్ని నమోదు చేశారు. గిరిజన నేల నుంచి ప్రపంచ వేదికపై భారత స్వరం వినిపించడం అరకు చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.