150 ఏళ్ల చరిత్రకు ఒంగోలు ముస్తాబు
ఈ నెల 30న ‘మన ఒంగోలు–మన పండుగ’.. 75 జతల భారీ ఎద్దుల ప్రదర్శన
ఘన వారసత్వాన్ని చాటేలా వేడుకలు.. పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్యే దామచర్ల పిలుపు
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
150 ఏళ్ల చరిత్రకు ప్రతీకగా నిలిచిన ఒంగోలు నగరం ఘన వారసత్వాన్ని చాటుకునేందుకు ముస్తాబవుతోంది. ‘మన ఒంగోలు–మన పండుగ’ పేరుతో ఈ నెల 30న నగరంలో భారీ వేడుకలు నిర్వహించనున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు తెలిపారు. నగర టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో 150 ఏళ్ల ఉత్సవాల వివరాలను ఆయన వెల్లడించారు. నగర ప్రజలందరూ ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఇప్పటికే చర్చి సెంటర్‌లో అశోకుని శిలాఫలకాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఒకే రోజు 150 మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేపట్టామని, అలాగే ఒకే గంటలో 80 వేలకు పైగా ఇళ్లను సందర్శించి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి రికార్డు సాధించామని చెప్పారు. తొలుత మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 30న ఒక్కరోజే ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉదయం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాలు, ప్రముఖుల సన్మానాలు నిర్వహించనున్నట్లు దామచర్ల తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మినీ స్టేడియం నుంచి అద్దంకి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వరకు 75 జతల భారీ ఎద్దులతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు. 150 ఏళ్ల చరిత్రలో ఒంగోలు పౌరుషానికి, రైతు సంస్కృతికి ప్రతీకగా ఈ ప్రదర్శన నిలుస్తుందని పేర్కొన్నారు.
వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, గవర్నర్ కంభంపాటి హరిబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. 150 ఏళ్ల చరిత్ర ఒక్కరోజు వేడుక కాదని, ఒంగోలు ప్రతి పౌరుడి గర్వకారణమని దామచర్ల పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మహా ఉత్సవాన్ని తమ సొంత పండుగగా భావించి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగొర్ల వెంకటరావు, నగర టీడీపీ అధ్యక్షుడు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు.