|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 08:40 PM
దేశంలో ఉల్లి ధరలు కొండెక్కితే వినియోగదారులు ఆందోళన చెందుతారు. కానీ.. ధరలు దారుణంగా పడిపోతే ఆరుగాలం కష్టపడ్డ రైతుల దీనగాథలు తెరపైకి వస్తాయి. సరిగ్గా అలాంటి విషాదమే జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మార్కెట్‌లో డిమాండ్ ఉండే.. ఉల్లిపంటను సాగు చేసినా గిట్టుబాటు ధర లేక ఓ రైతు తన పెట్టుబడి మొత్తాన్ని కోల్పోయి చివరికి పంటను పొలంలోనే ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాల్సి వచ్చింది.
రాజోలి గ్రామానికి చెందిన రైతు శేఖర్ రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని ఉల్లి పంట సాగు చేశారు. దీనికోసం ఆయన సుమారు రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టారు. 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని.. మంచి లాభం వస్తుందని శేఖర్ ఆశించారు. కానీ పంట కోత సమయానికి మార్కెట్‌లో పరిస్థితులు తలకిందులయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లి ధర కేవలం రూ. 300 మాత్రమే పలుకుతోంది. ఈ లెక్కన తన మొత్తం పంటను అమ్మినా రైతుకు వచ్చే రాబడి కేవలం రూ. 21,000 మాత్రమే. ఇది పెట్టిన పెట్టుబడిలో 10 శాతానికి కూడా సరిపోదు. దీనికి తోడు ఉల్లిగడ్డలు తవ్వడానికి, కోయడానికి అయ్యే కూలీల ఖర్చు, ఉల్లిని మార్కెట్‌కు తరలించడానికి అయ్యే రవాణా ఖర్చులు. ఈ ఖర్చులన్నీ పోగా.. రైతుకు తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయమైంది. ఈ పరిస్థితిని తట్టుకోలేక, కూలీలను ఏర్పాటు చేయలేక, అమ్మి మరింత నష్టపోలేక శేఖర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
తన కష్టం వృథా కాకూడదు.. పంట పాడైపోకూడదు అనే ఉద్దేశంతో శేఖర్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన పొలంలో ఉన్న ఉల్లిపాయలను ఎవరికి కావాలంటే వారు ఉచితంగా తీసుకెళ్లవచ్చని రాజోలి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియజేశారు. దీంతో స్థానిక ప్రజలు, వ్యాపారులు సంచులతో పొలంలోకి ఎగబడ్డారు. కొందరు రెండు, మూడు సంచుల్లో ఉల్లిగడ్డలు నింపుకుని సంతోషంగా వెళ్లారు. మరికొందరు తమ మోటారు సైకిళ్లు, ఆటోల్లో పెద్దమొత్తంలో తరలించుకుపోగా.. ఒక స్థానిక కూరగాయల వ్యాపారి ఏకంగా ట్రాక్టర్ లోడ్ ఉల్లిపాయలను తరలించడం గ్రామంలో చర్చనీయాంశమైంది.
గిట్టుబాటు ధర లేక నష్టపోయినా.. తన పంట వృథా కాకూడదని ఉదారత చూపిన రైతు శేఖర్ మనస్సు ఎంతో గొప్పదని గ్రామస్తులు కొనియాడారు. కౌలు, పెట్టుబడి కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, కనీస మద్దతు ధర కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఉల్లి వంటి పంటలను సాగు చేసే రైతులకు పంట బీమా సౌకర్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.