|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 08:48 PM
పండగ సీజన్ సమీపిస్తుండటంతో ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. దీపావళి సందర్భంగా సైబర్ నేరగాళ్లు భారీ డిస్కౌంట్లు, బహుమతుల పేరుతో వినియోగదారులను ఆకర్షించి, ఆర్థికంగా మోసగిస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. నకిలీ ఈ-కామర్స్ సైట్లు, ప్రమాదకరమైన ఏపీకే ఫైల్స్, ఫిషింగ్ లింకులు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు.సైబర్ నేరగాళ్లు పండగ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు, బహుమతులపై నమ్మశక్యం కాని ఆఫర్లతో కూడిన లింకులను సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ లింక్‌లపై క్లిక్ చేయడం లేదా వారు పంపిన ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా బాధితుల ఫోన్లలోకి మాల్‌వేర్ ప్రవేశిస్తుంది. దీని సాయంతో వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డు నంబర్లు, ఓటీపీలను దొంగిలించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. కొందరు "దీపావళి గిఫ్ట్" వచ్చిందని నమ్మించి, ప్రాసెసింగ్ ఫీజు పేరుతో చిన్న మొత్తంలో డబ్బులు కట్టించుకుని, ఆ తర్వాత పెద్ద మొత్తంలో దోచేస్తున్నారు.