telangana
తహసీల్దార్ హామీతో రైతుల రిలే నిరాహార దీక్షల విరమణ.. 12 రోజుల ఆందోళనకు తాత్కాలిక ముగింపు
యాలాల, మేజర్ న్యూస్: భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని, పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దీక్షా శిబిరాన్ని సందర్శించిన యాలాల తహసీల్దార్ గాయత్రి రైతులతో చర్చలు జరిపి, వారి సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు తమ రిలే నిరాహార దీక్షలను విరమించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ గాయత్రి మాట్లాడుతూ రైతుల భూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.తహసీల్దార్ హామీతో రైతులు 12 రోజులుగా కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా విరమించారు. అయితే తమ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమై న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. అధికారులు ఇచ్చిన హామీలను అమలు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యు. బుగ్గప్ప, ఎంఆర్‌పీఎస్ జిల్లా నాయకుడు మహేందర్, వడ్డే బాలరాజు, వడ్డే అంజిలమ్మ, వడ్డే వెంకటయ్య, వడ్డే మల్లమ్మ, వడ్డే సత్యమ్మ, వడ్డే పెద్ద వెంకటయ్య, వడ్డే రాములు తదితరులు పాల్గొన్నారు.