సమగ్ర భూసర్వేతో భూ సమస్యలకు పరిష్కారం: ఏడి మధుసూదన్ రావు
కుల్కచర్ల, మేజర్ న్యూస్ : భూముల హద్దులు, విస్తీర్ణం, రికార్డుల్లోని వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి భూ సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి భూసర్వే పైలెట్ ప్రాజెక్టును చేపట్టిందని వికారాబాద్ జిల్లా ఏడీ మధుసూదన్ రావు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కుల్కచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ గ్రామంలో గురువారం భూసర్వే, భూ భారతి పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏడీ మధుసూదన్ రావు మాట్లాడుతూ భూములకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులతో సరిపోల్చడం ద్వారా భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భూసర్వే ప్రక్రియలో రైతులు, భూయజమానులు తమ భూములకు సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. భూముల హద్దుల విషయంలో అపోహలు, వివాదాలు తలెత్తకుండా సర్వే ప్రక్రియకు ప్రజలు సహకరించాలని కోరారు. భూ భారతి పైలెట్ ప్రాజెక్టు విధానం, ప్రయోజనాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించడమే సదస్సు ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.