ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యం మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ బ్యూరో ప్రతినిధిః తెలంగాణ ప్రభుత్వ న్యాయ పోరాటం ఫలించి వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా దక్కడంపై ముఖ్యమంత్రి కి, న్యాయ వ్యవస్థకు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజల పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ భవన్ లో మీడియా తో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ‘ఓట్ బచావో - దేశ్ బచావో’ నినాదంతో ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి మండల, బ్లాక్ అధ్యక్షులు, మార్కెట్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు సహా ముఖ్య నాయకులందరూ ఢిల్లీకి తరలివెళ్లారన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై స్పందిస్తూ దేశ హోంమంత్రిగా హైదరాబాద్‌కు ఎవరైనా రావచ్చు, అనుమతులు ఇస్తామని, కానీ రాజకీయంగా కొన్ని సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు పట్ల, తెలంగాణ అమరవీరుల త్యాగాల పట్ల గతంలో పార్లమెంటు సాక్షిగా అవమానకరంగా మాట్లాడినందుకు అమిత్ షా, ప్రధాని మోదీలు తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. ‘ఓట్ చోర్ - గద్దీ చోడ్’ అంటూ ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం దేశవ్యాప్తంగా ఉందని చెప్పారు. మణిపూర్, ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లు, చైనా సరిహద్దు సమస్యలు వంటి కీలక అంశాలను గాలికొదిలేసి, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం అమిత్ షా పర్యటిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. బీసీల స్థితిగతులు మెరుగుపడాలన్నా, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలన్నా కులాల వారీ గణాంకాలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పశువులు, గొర్రెల లెక్కలు తీస్తున్న కేంద్రం, కోట్లాది మంది ఓబీసీల లెక్కలు ఎందుకు తీయడం లేదని నిలదీశారు. తెలంగాణ బీజేపీ బీసీ నాయకులు లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ తదితరులు చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన చేర్చాలని అమిత్ షాపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలనలో రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, దేశవ్యాప్తంగా కుట్రపూరితంగా పేదల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై న్యాయస్థానాలు సైతం గతంలో అక్షింతలు వేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఓటు హక్కు ప్రజల ప్రాథమిక, ప్రజాస్వామిక హక్కు అని, దాన్ని హరించే ప్రయత్నాలను సహించేది లేదన్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఎ.రవీందర్ సూర్య తెలగాణ బ్యూరో ప్రతినిధి