నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలకు సన్నాహాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ : జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి
హైదరాబాద్ మెజార్ న్యూస్ (సిటీ ప్రతినిధి):రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భూగర్భ జలాల పరిరక్షణతో పాటు తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ఇందులో భాగంగా మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీలు) శుద్ధి చేసిన నీటిని నిర్మాణ రంగం, పరిశ్రమలు, పార్కులు, గ్రీనరీ, ఇతర తాగునీరు అవసరం లేని పనులకు వినియోగించేలా నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.రానున్న ఎల్-నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ నీటి వనరుల వినియోగాన్ని పెంచేందుకు చేపడుతున్న చర్యలపై శుక్రవారం జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. గ్రీన్ వాటర్ సేవలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ట్యాంకర్ల నమోదు, ఫిల్లింగ్ స్టేషన్లు, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థల ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.
డిమాండ్‌కు అనుగుణంగా ఫిల్లింగ్ స్టేషన్లు:నిర్మాణ రంగం, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీల్లో శుద్ధి చేసిన నీటికి ఉన్న డిమాండ్‌ను ప్రాంతాలవారీగా అంచనా వేయాలని ఎండీ సూచించారు. అందుకు అనుగుణంగా సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఎస్టీపీలను గుర్తించి గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫిల్లింగ్ పాయింట్లు, ప్లాట్‌ఫారాలు, పంపింగ్ సదుపాయాలు, ఫ్లో మీటర్లు, ఇతర మౌలిక వసతులను సమకూర్చాలని పేర్కొన్నారు.
ట్యాంకర్లకు ప్రత్యేక బ్రాండింగ్.. జీపీఎస్ తప్పనిసరి:గ్రీన్ వాటర్ సరఫరాలో పారదర్శకత ఉండేలా ప్రతి ట్యాంకర్‌కు ప్రత్యేక బ్రాండింగ్‌తో పాటు జీపీఎస్ పరికరాన్ని తప్పనిసరిగా అమర్చాలని ఎండీ ఆదేశించారు. ట్యాంకర్ల కదలికలు, సరఫరా సమయాలు, డెలివరీ వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.ప్రతి ఫిల్లింగ్ స్టేషన్‌లో ఈ-పోస్ యంత్రాలను ఏర్పాటు చేసి, ట్యాంకర్లలో నింపే నీటి పరిమాణం, బుకింగ్, సరఫరా వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయాలని స్పష్టం చేశారు.
బుకింగ్ నుంచి డెలివరీ వరకు ఆన్‌లైన్ పర్యవేక్షణ:గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నమోదు, వినియోగదారుల రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ బుకింగ్, ట్యాంకర్ కేటాయింపు, జీపీఎస్ ట్రాకింగ్, డిజిటల్ చెల్లింపులు, డెలివరీ నిర్ధారణ వంటి సేవలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉండేలా ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేయాలని ఎండీ సూచించారు.
ఈ సమావేశంలో మూడు రీజియన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పంకజ, సామ్రాట్ అశోక్, సంతోష్, టెక్నికల్ డైరెక్టర్ ప్రభు, డైరెక్టర్లు నారాయణ, వాసా సత్యనారాయణ, కిరణ్ కుమార్, వివిధ విభాగాల చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎంలు), ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.