సూర్య,ముధోల్: మండల కేంద్రమైన ముధోల్‌లోని తహసీల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ డి. వెంకట మాధవ రావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ రికార్డులు, ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన రికార్డుల నిర్వహణ, పెండింగ్ దరఖాస్తులు, ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో జరుగుతున్న భూ సర్వే ల వివరాల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలు తమ భూ సమస్యలు, ఇతర రెవెన్యూ సంబంధిత పనుల కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి ఇబ్బందులు కలగకుండా సత్వర సేవలు అందించాలని తెలిపారు. అనంతరం కార్యాలయంలో ఉన్న రికార్డుల గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని సిబ్బందికి సూచించారు. తహసిల్దార్ కార్యాలయ ఆవరణను జాయింట్ కలెక్టర్ తిరిగారు. ఈ తనిఖీలో తహసీల్దార్ శ్రీలత, డిప్యూటీ తహసిల్దార్ తెలంగ్ రావు, ఆర్ ఐ సత్యనారాయణ తోపాటు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.