BREAKING
జనని హాస్పిటల్‌లో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ వాతావరణ మార్పులపై రెండు రోజుల జాతీయ సదస్సు సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా మెగా జాబ్ మేళా దేవాలయ భూముల్లో అక్రమ నిర్మాణాల ఆరోపణలు.. అధికారులకు పట్టదా..? *కంబాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ* తలారి రంగయ్య పై చర్యలు తీసుకోవాలి.. చెన్నై వేదికగా భారత్-మ్యాన్మార్ సంయుక్త త్రివిధ దళాల విన్యాసాలు దీపావళి పండుగ ను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై చైతన్య కిరణ్ షేర్ మొహమ్మద్ పేట లో సర్పంచ్ ఎలక్షన్ హీట్ తొలి బిమ్‌స్టెక్ సముద్ర భద్రతా విన్యాసాలు ముగింపు రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం:చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ *సదాశివపేటలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఘన ప్రారంభం* మచ్చ బొల్లారం ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ తరలింపునకు కసరత్తు.. నాలుగు ప్రత్యామ్నాయ స్థలాల పరిశీలన శిరీష కు అభినందనలు వెల్లువ *సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్*

అర్హులైన పట్టభద్రులకు ఓటు హక్కు కల్పిస్తాం -జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్

Select Suryaa Now
అర్హులైన పట్టభద్రులకు ఓటు హక్కు కల్పిస్తాం  -జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన పట్టభద్రుల దరఖాస్తులను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిశీలించి ఆమోదించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ పురోగతి, దరఖాస్తుల పరిశీలన, అర్హులైన ఓటర్ల నమోదు తదితర అంశాలపై గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, అదనపు కలెక్టర్ బి. చేన్నయ్యతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ పురోగతి, ఇప్పటివరకు నమోదైన ఓటర్ల వివరాలు, దరఖాస్తుల పరిశీలన స్థితిని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు.
జిల్లా వ్యాప్తంగా నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 38,377 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. నమోదైన దరఖాస్తుల్లో సుమారు 80 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి ఆమోదించినట్లు వెల్లడించారు. ఇంకా 1,426 దరఖాస్తులు పరిశీలనకు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా నిర్ణీత గడువులోగా పరిశీలించి, అర్హత ఉన్న వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతోందని తెలిపారు.
పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తుదారులు సమర్పించిన విద్యార్హత ధ్రువపత్రాలు, ఇతర వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హత ఉన్న వారి దరఖాస్తులను ఆమోదిస్తున్నామని వివరించారు.
అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటరు నమోదుకు సంబంధించి నకిలీ ధ్రువపత్రం సమర్పించినట్లు వచ్చిన ఫిర్యాదు విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఫిర్యాదును పరిశీలించి నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఓటరు నమోదు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తెలిపారు. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

*నియోజకవర్గాల వారీగా పట్టభద్రుల ఓటర్ల వివరాలు

నాగర్ కర్నూల్ నియోజకవర్గం:
12,539 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కాగా, ఇంకా 310 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
అచ్చంపేట నియోజకవర్గం:
9,329 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కాగా, ఇంకా 128 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
కొల్లాపూర్ నియోజకవర్గం:
7,041 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కాగా, ఇంకా 290 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
కల్వకుర్తి నియోజకవర్గం:
9,468 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కాగా, ఇంకా 698 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
మొత్తంగా జిల్లాలో 1,426 దరఖాస్తులు పరిశీలనకు పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిశీలన పూర్తి చేసి అర్హులైన పట్టభద్రులకు ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు అర్చన, బన్సీలాల్, జనార్దన్ రెడ్డి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవి కుమార్, ఎన్నికల డీటీ కల్పన తదితర అధికారులు పాల్గొన్నారు.

సందడి రవీందర్ రెడ్డి,నాగర్ కర్నూల్ , రూరల్, సూర్య న్యూస్