telangana
164 రోజులుగా ఎస్ పి ఎం కార్మికుల పోరాటం!
సూర్య,కాగజ్‌నగర్: కొమరం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించి, ఎన్నికల్లో విజయం సాధించిన సంఘంతోనే వేతన ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఈరోజు శుక్రవారం 164వ రోజుకు చేరుకున్నాయి. మిల్లు ప్రధాన గేటు ఎదుట కొనసాగుతున్న ఈ దీక్షల్లో కూశన రాజన్న, సురేందర్ యాదవ్ పాల్గొన్నారు. వారికి మద్దతుగా జేఏసీ నాయకులు, కార్మికులు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కార్మికులకు న్యాయంగా దక్కాల్సిన గుర్తింపు హక్కును సాధించుకునేందుకే నెలల తరబడి శాంతియుతంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. గుర్తింపు ఎన్నికలు నిర్వహించకుండా యాజమాన్యం కోర్టును ఆశ్రయించి అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. లేబర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు.కార్మికుల సహనాన్ని పరీక్షించకుండా యాజమాన్యం కోర్టులో దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకుని, తక్షణమే గుర్తింపు ఎన్నికలకు మార్గం సుగమం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ద్వారా కార్మికుల మద్దతు పొందిన సంఘానికే ప్రాతినిధ్యం కల్పించి, వేతన ఒప్పందం జరపాలని స్పష్టం చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఏకే సింగ్, కో-కన్వీనర్లు మహమ్మద్ షబ్బీర్, శీలం రాజమౌళి, మొగిలి వెంకటేష్, నీలి రాజన్న, కొత్తకొండ రాజేష్, గోలెం వెంకటేష్, ముంజం ఆనంద్ కుమార్, అంబాల ఓదెలు తదితరులు పాల్గొన్నారు.