యువత గుండెల్లో గుబులు
- ఒత్తిడి, జంక్‌ఫుడ్‌తో చిన్న వయసులోనే గుండెజబ్బులు
- సన్‌రైజ్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కిరణ్‌కుమార్
- వాగేశ్వరి ఫార్మసీ కళాశాలలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం
- 150 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు
సూర్య, తిమ్మాపూర్
మారుతున్న జీవనశైలి, విపరీతమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జంక్‌ఫుడ్ సంస్కృతితో పాటు శారీరక శ్రమ తగ్గడమే యువతలో గుండె సంబంధిత వ్యాధులు పెరగడానికి ప్రధాన కారణమని సన్‌రైజ్ హాస్పిటల్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కొండపాక కిరణ్‌కుమార్ స్పష్టం చేశారు. తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ (యూజీసీ అటానమస్)లో శుక్రవారం "ఎంపవరింగ్ ఫార్మసిస్ట్ ఫర్ హెల్తియర్ ఫ్యూచర్" అనే ఇతివృత్తంతో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ...నేటి డిజిటల్ యుగంలో యువత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.నిత్యం యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఇది గుండెజబ్బులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.వాగేశ్వరి విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి డాక్టర్ గండ్ర శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ...విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. సరైన ఆహార అలవాట్లు, రోజువారీ వ్యాయామంతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు.కార్యక్రమంలో భాగంగా సన్‌రైజ్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. విద్యార్థులు, అధ్యాపకులతో కలిపి సుమారు 150 మందికి బ్లడ్ షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈసీజీ పరీక్షల్లో ఏవైనా లోపాలు గుర్తించిన వారికి సన్‌రైజ్ హాస్పిటల్‌లో ఉచితంగా 2డీ ఎకో పరీక్షలు జరుపుతామని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. కార్యక్రమంలో వాగేశ్వరి విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి డాక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు వినోద్, సీహెచ్ ప్రకాష్‌రెడ్డి, డాక్టర్ దివ్య ప్రియాంక, డాక్టర్ మహేష్‌కుమార్‌రెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎలిగేటి శ్రవణ్‌కుమార్‌తో పాటు వివిధ విభాగాల అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.