టీబీ రహిత గ్రామంగా బచ్చాయిపల్లికి గుర్తింపు
టీబీ రహిత గ్రామంగా బచ్చాయిపల్లికి గుర్తింపు
-జిల్లాలో ఎంపికైన 12 గ్రామ పంచాయతీల్లో బచ్చాయిపల్లికి చోటు
-గ్రామ ప్రజల సహకారంతోనే ఈ ఘనత సాధ్యం
-సర్పంచ్ దుర్గం ప్రేమలత యాదగిరి
సిద్దిపేట రూరల్, : బచ్చాయిపల్లి గ్రామ పంచాయతీ టీబీ రహిత గ్రామంగా గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని సర్పంచ్ దుర్గం ప్రేమలత యాదగిరి అన్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఎంపికైన 12 గ్రామ పంచాయతీల్లో సిద్దిపేట రూరల్ మండలం బచ్చాయిపల్లికి చోటు దక్కడం గ్రామ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధన్‌రాజ్, టీబీ ఇన్‌చార్జి వైద్యాధికారి వినోద్ బాబ్జీ చేతుల మీదుగా సర్పంచ్ ప్రేమలత యాదగిరి జిల్లా స్థాయి అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, టీబీ లక్షణాలు ఉన్నవారు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించిన వైద్య సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. గ్రామ ప్రజల సహకారం, వైద్య సిబ్బంది కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్తులోనూ గ్రామాన్ని టీబీ రహితంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.