telanagana
సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం:బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి
మంచిర్యాల టౌన్ : సింగరేణి కార్మికుల శ్రమతో సంస్థకు లాభాలు వస్తున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడీతో కార్మికులను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఆరోపించారు. సింగరేణి కార్మికులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటాపై నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం మంచిర్యాలలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ గత సంవత్సరం కార్మికులకు రూ.2.50 లక్షలు బోనస్‌గా అందించగా, ఈ ఏడాది కేవలం రూ.1.50 లక్షలు మాత్రమే ప్రకటించడం అన్యాయమని విమర్శించారు.సింగరేణి కార్మికులు కష్టపడి బొగ్గు ఉత్పత్తి చేయడం వల్లే సంస్థకు లాభాలు వస్తున్నాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వం సంస్థ నిధులను ఇతర అవసరాలకు వినియోగిస్తూ సింగరేణికి నష్టం కలిగిస్తోందని ఆరోపించారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ సింగరేణిని ఏటీఎంలా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు.సింగరేణి లాభాల లెక్కల్లో తప్పుడు వివరాలు చూపించే విధానాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని కొనసాగిస్తోందని ఆరోపించారు.సింగరేణి కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించడం లేదని విమర్శించారు. మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నాయకులు, చెన్నూరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ కారణంగా అర్హులైన పది మంది ఓట్లు తొలగించబడ్డాయని నిరూపించాలని సవాల్ విసిరారు. మరణించిన వారి, డబుల్ ఓట్లు, చిరునామా మార్పుల కారణంగా నమోదైన ఓట్లను తొలగిస్తున్నారని, అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగడం లేదని ఆయన పేర్కొన్నారు.గోదావరిఖని సభలో కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను రఘునాథ్ వెరబెల్లి ఖండించారు. కిషన్‌రెడ్డి చొరవతో నైని కోల్ బ్లాక్‌కు అవసరమైన అనుమతులు లభించాయని, తాడిచర్ల-2 ప్రాజెక్టు, మణుగూరు డీప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కేందుకు కూడా కేంద్రం సహకరించిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థకు అప్పగించారని ఆరోపించారు.సింగరేణి వాస్తవ లాభాల లెక్కలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని, కార్మికులకు 35 శాతం లాభాల వాటా చెల్లించాలని రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు.కార్మికులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్‌తో పాటు తుల ఆంజనేయులు, వంగపల్లి వెంకటేశ్వర్రావు, కస్తూరి నాగరాజు,పట్టి వెంకటకృష్ణ, కమలాకర్‌రావు,ఆకుల అశోక్‌వర్ధన్,జయరామరావు, వైద్య శ్రీధర్, రంగ శ్రీశైలం, కుర్రే చక్రవర్తి, బోయిని దేవేందర్, రామగిరి బనేష్, బూర్ల చిరంజీవి,మహేందర్,తరుణ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.