సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : కామారెడ్డి జిల్లాలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్‌పామ్, టమోటా తోటలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించి, పంటల సాగు విధానం, దిగుబడులు, రైతులకు లభిస్తున్న ఆదాయాన్ని పరిశీలించారు.
మొదటగా రైతు అర్జున్ రావు సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతు తన అనుభవాలను వివరిస్తూ, సంప్రదాయ వరి సాగుతో పోలిస్తే ఆయిల్‌పామ్ సాగు ద్వారా మెరుగైన ఆదాయం పొందుతున్నానని, ఈ పంట సాగు పట్ల సంతృప్తిగా ఉన్నానని తెలిపారు.అనంతరం శివాయిపల్లి గ్రామంలో రైతు గురువా రెడ్డి సాగు చేస్తున్న టమోటా తోటను కలెక్టర్ పరిశీలించారు. టమోటా సాగు ద్వారా వరి పంట కంటే అధిక ఆదాయం పొందుతున్నానని, ప్రత్యామ్నాయ పంటల సాగు తనకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తోందని రైతు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం, సాగునీటి కొరతను దృష్టిలో ఉంచుకుని రాబోయే యాసంగి పంట కాలంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. భూమి స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకుని, అధిక ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని పేర్కొన్నారు.రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్‌పామ్, టమోటా వంటి ప్రత్యామ్నాయ పంటల సాగును పరిశీలించాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి జ్యోతి, ఉద్యాన శాఖ అధికారి సుమన్, ఉద్యాన విస్తరణ అధికారి బాపురెడ్డి, హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ నిర్వాహకులు చంద్రబాబు, సీనియర్ నిర్వాహకులు శ్రీనివాస్, ఆయిల్‌పామ్ సిబ్బంది హిమకుమార్, అరుణ్, మురళి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.