గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు: ఉమ్మడి మూడు జిల్లాల్లో హాట్‌టాపిక్‌గా మారిన వైనం
సూర్య తెలంగాణ డెస్క్: నల్లగొండ జిల్లా లక్ష్మీ గార్డెన్‌లో అత్యంత వైభవంగా నిర్వహించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ కార్యక్రమంలో సిట్టింగ్ టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సమక్షంలో మంత్రి చేసిన ఆసక్తికర ప్రకటన ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
రాబోయే ఉమ్మడి నల్లగొండ–వరంగల్–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో శ్రీ సుంకరి బిక్షం గౌడ్ గెలిచే అవకాశం అత్యధికంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆయనకు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేయడం రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. ఉపాధ్యాయ దినోత్సవ స్పూర్తితో జరిగిన ఈ సభలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావన తేవడం, అందునా ఒక నిర్దిష్ట అభ్యర్థి గెలుపు అవకాశాలపై మంత్రి సానుకూలంగా స్పందించడం సర్వత్రా చర్చకు దారితీసింది.
ప్రస్తుతం ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతున్న తరుణంలో, రాష్ట్ర కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అధికార పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడంతో పాటు ప్రత్యర్థి వర్గాల్లోనూ తీవ్రమైన చర్చకు తెరలేపాయి. ఎన్నికల సమీపిస్తున్న వేళ మంత్రి చేసిన ఈ ప్రకటన రాబోయే రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.