జంతు సంక్షేమం, ప్రజా భద్రతకు ప్రాధాన్యత మంత్రి వాకిటి శ్రీహరి ప్రమాదకర కుక్కల నిర్వహణ, జంతు సంరక్షణ కేంద్రాలు అత్యవసర పశువైద్య సేవలను మెరుగుపరచడంపై చర్చ
తెలంగాణ బ్యూరో ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు రెండో బోర్డు తొలి సమావేశం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షతన జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వీధి కుక్కల నిర్వహణ, కుక్క కాట్ల నివారణ, ప్రజా భద్రత, జంతు సంక్షేమం తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారు. ఏ బీ సీ రూల్స్–2023 అమలు, ఏ బీ సీ కేంద్రాల బలోపేతం, ప్రమాదకర కుక్కల నిర్వహణ, జంతు సంరక్షణ కేంద్రాలు, అత్యవసర పశువైద్య సేవలను మెరుగుపరచడంపై చర్చించారు. చిన్నారులు, ప్రజలు, రహదారి భద్రతతో పాటు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అదే సమయంలో జంతువుల పట్ల చట్టబద్ధమైన, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్యారోగ్య, విద్య, పోలీస్ శాఖలు, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో జయేష్ రంజన్ , డా. కె. ఇలంబర్తి , డా. బి. గోపీ , ప్రొఫెసర్ జ్ఞానప్రకాశ్, దివ్య దేవరాజన్ , చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్‌లైఫ్) క్షితిజ, జిహెచ్‌ఎంసి, సిఎంసి, ఎంఎంసి కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.