ఇందిరమ్మ ఇల్లు వస్తుందనుకుంటే రోడ్డున పడ్డారు
అధికారుల నిర్లక్ష్యంతో వృద్ధ దంపతుల దయనీయ స్థితి
సూర్య తెలంగాణ డెస్క్: ఇందిరమ్మ ఇల్లు మంజూరైందన్న ఆనందం ఆ వృద్ధ దంపతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రభుత్వం ఇచ్చే ఇంటి నిర్మాణ సాయం అందుతుందన్న ఆశతో ఉన్న పాత ఇంటిని కూల్చివేసుకుని, ఇప్పుడు అధికారుల అలసత్వం వల్ల నివాసం లేక రోడ్డున పడ్డారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన కోలిపాక వెంకటయ్య, వెంకటమ్మ అనే వృద్ధ దంపతులకు ఎదురైన ఈ దయనీయ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
బాధితుల కథనం ప్రకారం, గత జూన్ మాసంలో ఇందిరమ్మ ఇల్లు పథకం కింద తమకు ఇల్లు మంజూరైనట్లు ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా ఇంటి ఎంపిక పత్రాన్ని కూడా పొందినట్లు వృద్ధ దంపతులు తెలిపారు. ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందన్న నమ్మకంతో, నిర్మాణం ప్రారంభించేందుకు తాము నివసిస్తున్న పాత మట్టి ఇంటిని కూల్చివేశారు. పత్రాలు చేతికి రావడంతో సొంతింటి కల నిజమవుతుందని భావించిన ఆ నిరుపేద కుటుంబానికి అధికారుల తదుపరి నిర్ణయం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఇంటి నిర్మాణం కోసం పాత నివాసాన్ని తొలగించిన తర్వాత, క్షేత్రస్థాయి పరిశీలన పేరిట వచ్చిన అధికారులు వీరు పథకానికి అర్హులు కారంటూ మాట మార్చారు. దీంతో ఉన్న ఇల్లు పోయి, కొత్త ఇల్లు రాక ఆ వృద్ధ దంపతులు తీవ్ర అవస్థలు పడుతూ వీధిన పడ్డారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, వయోభారంతో ఉన్న తాము ఈ వయసులో ఎక్కడ తలదాచుకోవాలో తెలియక కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి తమకు తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.