BREAKING
ఢిల్లీలో హిందూ కాలేజీ విద్యార్థినులను వేధించిన ఇద్దరు యువకుల అరెస్ట్.. ఎస్‌యూవీ వాహనం సీజ్ చిన్నారిపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు.. పకడ్బందీ వాదనలు వినిపించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రవీందర్‌కు డీసీపీ సన్మానం ఒక ఉగ్రవాద దేశం నన్ను ఆ ప్రశ్న అడుగుతోంది.. ఐక్యరాజ్యసమితిలో పాక్ జర్నలిస్ట్‌కు విదేశాంగ మంత్రి జైశంకర్ దిమ్మతిరిగే కౌంటర్ గణనాథుడికి ఘన వీడ్కోలు కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు మృత్యుకుహరాల్లా మారిన పరవాడ – సబ్బవరం రహదారి: ఆకట్టుకుంటున్న ఆర్యన్ గౌర, మోనిషా మోహన్ మేనన్ '#JAAN' ఫస్ట్ లుక్ పోస్టర్.. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్! గణనాథుని కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి అథ్లెటిక్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు.. పతకాలతో అదరగొట్టిన గుల్‌వీర్, మన్‌ప్రీత్, బరణిక! ధారూర్ అభివృద్ధికి రూ.8.40 కోట్ల రోడ్డు నిధులు 12 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత మన్‌ప్రీత్ కౌర్‌కు ఏషియన్ గేమ్స్ పతకం.. ఇక ముందూ పరుగులే లక్ష్యం! తెలంగాణవ్యాప్తంగా ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు.. వేలాది గణనాథుల నిమజ్జనం బోధన్‌లో రూ.5.10 లక్షలకు లడ్డూ వేలం 52 అడుగుల భారీ మహా గణపతి నిమజ్జనం పూర్తి.. నిర్దేశిత ప్రదేశంలో వైభవంగా వీడ్కోలు! ఉప్పాడ

డ్రగ్స్ నియంత్రణలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ పోలీస్:డీజీపీ సి.వి.ఆనంద్‌

Select Suryaa Now
డ్రగ్స్ నియంత్రణలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ పోలీస్:డీజీపీ సి.వి.ఆనంద్‌

-జాతీయ స్థాయిలో ఈగల్‌ సత్తా.. డీజీపీ  అభినందనలు

- 10 అంశాల్లో ఆరింటిలో అత్యుత్తమ పనితీరు

- ఈగల్‌ ఫోర్స్‌కు డీజీపీ సి.వి.ఆనంద్‌ అభినందనలు

- యువతను కాపాడుకోవడం మనందరి బాధ్యత..
‘నషాముక్తి తెలంగాణ’ కోసం సమష్టిగా పనిచేద్దాం

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి :  డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ పోలీసులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని డీజీపీ సి.వి.ఆనంద్‌ అభినందించారు. సెప్టెంబరు 22, 23 తేదీల్లో జరిగిన జాతీయస్థాయి యాంటీ నార్కోటిక్స్‌ అధిపతుల సమావేశంలో వెల్లడైన పనితీరు వివరాల ప్రకారం.. 10 కీలక అంశాల్లో తెలంగాణ పోలీసులు ఆరింటిలో ముందంజలో నిలిచారని తెలిపారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఈగల్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య, ఇతర అధికారులు, సిబ్బందితో డీజీపీ సమావేశమై పనితీరును సమీక్షించారు.

డ్రగ్స్‌ వల్ల యువత, సమాజ భవిష్యత్తుకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని.. మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసుల కృషి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని డీజీపీ పేర్కొన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛ, సహకారం అందిస్తోందని తెలిపారు. ‘నషాముక్తి తెలంగాణ–నషాముక్తి భారత్‌’ లక్ష్యంతో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

*అరెస్టుల్లో జాతీయ సగటు కంటే మూడింతలు ఎక్కువ

డ్రగ్స్‌ కేసుల్లో అరెస్టుల విషయంలో తెలంగాణ పోలీసులు గణనీయమైన పనితీరు కనబరిచారని అధికారులు డీజీపీకి వివరించారు. జాతీయస్థాయిలో ప్రతి కేసుకు సగటున 1.3 మంది అరెస్టు చేస్తుండగా.. తెలంగాణలో ఆ సంఖ్య 3.7గా ఉందని తెలిపారు. డ్రగ్స్‌ నెట్‌వర్క్‌పై లోతుగా దర్యాప్తు చేస్తూ, సంబంధిత వ్యక్తులపై సమగ్రంగా చర్యలు తీసుకుంటున్న తీరుకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

ఆస్తుల స్వాధీనం.. యువత, మైనర్లను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు

డ్రగ్స్‌ అక్రమ రవాణా, విక్రయాలతో సంబంధం ఉన్న వారి ఆస్తులను చట్టప్రకారం స్వాధీనం చేసుకోవడంలోనూ తెలంగాణ పోలీసులు ముందున్నారు. ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 68ఎఫ్‌ కింద డ్రగ్స్‌ అక్రమ కార్యకలాపాలతో ముడిపడిన ఆస్తులపై చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో డ్రగ్స్‌ బారిన పడే అవకాశం ఉన్న యువత, మైనర్లను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.

అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ నెట్‌వర్క్‌పై నిఘా

తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ మూలాలను ఛేదించేందుకు రాష్ట్ర సరిహద్దులు దాటి కూడా దర్యాప్తు చేపడుతోంది. థాయిలాండ్‌, గోవా, ముంబయి తదితర ప్రాంతాలకు వెళ్లి డ్రగ్స్‌ సరఫరా, రవాణా వ్యవస్థపై ఆధారాలు సేకరించి కేసులు నమోదు చేసినట్లు డీజీపీకి వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో విస్తరించిన నెట్‌వర్క్‌లపై సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

డార్క్‌వెబ్‌పై ప్రత్యేక నిఘా

డార్క్‌వెబ్‌ కార్యకలాపాలపై విశ్లేషణ చేపట్టి డ్రగ్స్‌ విక్రయాలకు పాల్పడుతున్న నెట్‌వర్క్‌లను గుర్తించడంలోనూ ఈగల్‌ ఫోర్స్‌ ప్రత్యేక దృష్టి సారించింది. డార్క్‌వెబ్‌ ద్వారా జరుగుతున్న అక్రమ లావాదేవీలను గుర్తించి, భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. సుమారు 500 కిలోలకు పైగా డ్రగ్స్‌కు సంబంధించిన 15కుపైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

డ్రగ్స్‌ నియంత్రణలో ఉత్తమ నిర్మాణం, కేసుల్లో అరెస్టులు, ఆస్తుల స్వాధీనం, అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు, డార్క్‌వెబ్‌ విశ్లేషణ, భారీ మొత్తంలో డ్రగ్స్‌ స్వాధీనం వంటి ఆరు అంశాల్లో తెలంగాణ పోలీసులు జాతీయస్థాయిలో ముందంజలో ఉన్నారని డీజీపీ పేర్కొన్నారు.

మిగిలిన అంశాల్లోనూ ముందుండాలి

డ్రగ్స్‌ నియంత్రణలో ఇప్పటివరకు సాధించిన విజయాలతో సంతృప్తి చెందకుండా.. మిగిలిన అంశాల్లోనూ తెలంగాణ పోలీసులు మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని డీజీపీ ఆకాంక్షించారు. భవిష్యత్‌ తరాలను మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు.

‘‘యువతను కాపాడుకుంటేనే తెలంగాణ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. నషాముక్తి తెలంగాణ, నషాముక్తి భారత్‌ లక్ష్యంగా మనందరం సమష్టిగా పనిచేయాలి. డ్రగ్స్‌ నియంత్రణలో దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపేలా మరింత కృషి చేద్దాం’’ అని డీజీపీ సి.వి.ఆనంద్‌ పిలుపునిచ్చారు.