చెక్‌డ్యాంను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
సిద్దిపేట రూరల్. సూర్య న్యూస్: పుల్లూరు గ్రామ శివారులోని నక్కొని బండ కుంట చెక్‌డ్యాంను ధ్వంసం చేసి,కుంటను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ఉపసర్పంచ్ ఒగ్గు రాజేష్ డిమాండ్ చేశారు.గురువారం ఆయన ఆధ్వర్యంలో గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని ధ్వంసమైన చెక్‌డ్యాంను, చదును చేసిన భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్లూరు గ్రామ శివారులో 2003లో ప్రభుత్వం చెక్‌డ్యాంను నిర్మించిందని తెలిపారు. అలాంటి చెక్‌డ్యాంను కొంతమంది నాయకుల అండతో ధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ, కుంటను కబ్జా చేసేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.విషయం తెలుసుకున్న రూరల్ ఇరిగేషన్ ఏఈ సంఘటనా స్థలానికి చేరుకుని కుంటను పరిశీలించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు పడాల దేవేందర్, ములుగు కనకమల్లేశం, శంకర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
(సూర్య రూరల్, రమేష్).