telanagana
చలో ఇంద్రవెల్లి కార్యక్రమ పోస్టర్, ఆహ్వాన పత్రాల విడుదల
సూర్య జైనూర్: మండల కేంద్రంలో ఈ నెల 23వ తేదీన ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న ఆదివాసీ అమరవీరుడు కుమ్రం భీం కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను, ఆహ్వాన పత్రాలను విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ మార్కెట్ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్, వివిధ రాయిసెంటర్ల సార్మేడీలు, సర్పంచులు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మధురాజ్ మడావిలను కలిసి కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు.ఆదివాసీ అమరవీరుడు కుమ్రం భీం ఆశయ సాధన కోసం చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఇంద్రవెల్లిలో ఈ నెల 23వ తేదీన కుమ్రం భీం కాంస్య విగ్రహావిష్కరణ, ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆదివాసీ నాయకులు, యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్కా భాపురావ్, విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు, తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్కా చిత్రు, గిన్నెరా ఉపసార్మేడి మెస్రం లక్ష్మణ్, జైనూర్ మండల నాయకులు మెస్రం శేకు, మెస్రం అంబాజీరావు, మార్లవాయి సార్మేడి గేడం గణపత్, లేండిజాల సార్మేడి మెస్రం భాదిరావు, జైనూర్ సర్పంచ్ కొడప ప్రకాష్, ధానోరా సర్పంచ్ మెస్రం భూపతి, డబోలి సర్పంచ్ మెస్రం నగేష్, భూసిమెట్ట సర్పంచ్ ఆత్రం నగేష్, ఆదివాసీ విద్యార్థి సంఘం సిర్పూర్ మండల ప్రధాన కార్యదర్శి ఆత్రం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.