భూపాలపల్లి లో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువత.
– 148 కంపెనీలు.. 12 వేల ఉద్యోగాలే లక్ష్యం.
భూపాలపల్లి ప్రతినిధి,
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్పా గ్రాండ్‌లో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.జాబ్ మేళాలో మొత్తం 148 కంపెనీల ప్రతినిధులు పాల్గొని సుమారు 12 వేల ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఇంటర్వ్యూలు చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి యువత భారీగా తరలిరావడంతో జాబ్ మేళా ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రిజిస్ట్రేషన్ ప్రక్రియను, వివిధ స్టాల్స్ ను పరిశీలించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, విమానయాన తదితర రంగాల్లో ఉద్యోగాలు పొందేందుకు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టాస్క్ సీఈఓ ప్రదీప్ రెడ్డి, ప్లేస్ మెంట్ టీం లీడర్ నితిన్ రెడ్డి, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్, మున్సిపల్ చైర్మన్ కొమురయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్,అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, జిల్లా అధికారులు, కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.